రేపటి నుండి అధిక మాసం ఈ మాసంలో శుభకార్యాలు చేయొచ్చా ? చేయకూడదా ?
Blog Description
మన తెలుగు క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. అలాగే ఈ శార్వరి నామ సంవత్సరంలో అధిక మాసం వచ్చింది. అయితే ఈ అధిక మాసంలో ఏ విధమైన శుభకార్యాలు చేయకూడదని పండితులు చెబుతున్నారు. ఈ అధిక మాసం 2020 సంవత్సరంలో సెప్టెంబర్ 18వ తేదీన వచ్చింది. అయితే ఈ సమయంలో దేవుళ్ల పూజలకు సంబంధించిన కార్యక్రమాలను మాత్రం కచ్చితంగా చేయాలంట. ఎందుకంటే శుభకార్యాలు వేరు. దేవతల పూజలు వేరు. ఈ అధిక మాసంలో సత్యనారాయణ వ్రతం ఆచరిస్తే ఎంతో పుణ్యఫలం లభిస్తుంది. ఈ అధిక మాసంలోని 30 రోజులలోని ఏడు రోజులలో ప్రత్యేకించి పౌర్ణమికి ముందుగా భాగవతాన్ని పారాయణం చేయాలి లేదా భాగవతం పారాయణం చేసే పండితులకు ఆ గ్రంధాన్ని అందజేయాలి. భాగవతంలోని దశమ స్కందంలోని క్రిష్ణునికి సంబంధించిన కథనాలను పారాయణం చేస్తే విశేషమైన పుణ్యఫలం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ఇలాంటి అవకాశం ప్రతి సంవత్సరం రాదు. ఈ అధిక మాసం ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే వచ్చే గొప్ప అవకాశం. కాబట్టి ఇలాంటి సువర్ణాకాశాన్ని వినియోగించుకోవాలని చెబుతున్నారు. దక్షిణ భారతదేశంలోని మన తెలుగు రాష్ట్రాల ప్రజలు చాంద్రమానాన్ని పాటిస్తే.. తమిళనాట ఉండే ప్రజలు సౌరమానాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. అధికమాసం అంటే ? చంద్రుని కదలికలను అనుగుణంగా ఉండే చాంద్రమానం కు , సూర్యుని కదలికలను అనుగుణంగా ఉండే సౌర మానంకు లెక్కల్లో కొన్ని తేడాలు వస్తుంటాయి. అందులో సౌరమానంలో సంవత్సరానికి కేవలం 360 రోజులు మాత్రమే వస్తాయి. అదే చాంద్రమానంలో 365 రోజులు వస్తాయి. ఇలాంటి తేడాలను సరిచేసి ఒకే లైనుపై తీసుకొచ్చే ప్రయత్నాన్ని జ్యోతిష్యశాస్త్ర నిపుణులు చేశారు. ఇలా రెండు మాసాలను సర్దుబాటు చేసిన కాలాన్నే అధిక మాసం అంటారు. ఎప్పుడైతే సంక్రమణం ఉండదో.. ఈ మాసంలో పౌర్ణమి వచ్చినప్పటికీ , ఆ పౌర్ణమితో కూడుకున్నటువంటి విశేష గుణగణాలు కనిపించవని పండితులు చెబుతున్నారు. ఈ సమయంలో సంక్రమణం కూడా రాదు. అసంక్రాంతి , ద్విసంక్రాంతి వస్తుంది. ఏ మాసంలో అయితే సంక్రమణం ఉండదో ఆ మాసమే అధిక మాసం అని చెబుతున్నారు. శుభకార్యాలు చేయకూడదు.. ఇలా సంక్రమణం లేని మాసంలో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు. వివాహ కార్యక్రమాలు , ఇంట్లోకి ప్రవేశించడం , ఉపనయనాల వంటివి చేయకూడదు. దేవతలకు పూజలు.. అయితే ఈ మాసంలో సకల దేవతలకు పూజలు మాత్రం చేయొచ్చు. ఎందుకంటే ఇవి శుభకార్యాలు కాదు. ఈ అధిక మాసంలో పుణ్యకార్యాలైన సత్యనారాయణ వ్రతం , దేవుళ్లకు అభిషేకాలు , నవగ్రహ హోమాలు , నవగ్రహ జపాలు , శాంతి పూజలు ప్రత్యేకించి భాగవత పారాయణం , రామాయణ పారాయణం , ఆంజనేయస్వామికి సంబంధించి హనుమాన్ చాలీసా వంటివి కచ్చితంగా చేయాలి. ఈ నెలలో పుణ్యకార్యాలు చేస్తే.. ఈ నెల మొత్తం ఒక నియమం పెట్టుకోవాలి. నిత్యం ఇష్టదైవాన్ని తలచుకుని ద్యానం చేయడం లేదా జపం చేయడం వంటివి చేస్తే ఎన్నో రెట్ల పుణ్యఫలం వస్తుంది. ఉదాహరణకు మిగిలిన మాసాల్లో ఒకసారి రామ అంటే , ఒక్కసారే ఫలితం వస్తుంది. అయితే ఈ అధిక మాసంలో అంటే మాత్రం కోటి రెట్ల ఫలితం ఉంటుందని పండితులు చెబుతున్నారు. పురుషోత్తమ మాసం.. ఈ అధిక మాసాన్ని పురుషోత్తమ మాసంగా కూడా పిలుస్తారు. ఉత్తమ పురుషగా అందరి జీవులలో ఉండేవాడు.. సర్వజీవులలో ఆత్మస్వరూపుడిగా ఉండే వాడు పరమాత్ముడు. ఆ విధంగా పరమాత్ముడిని దర్శించడానికి , అందుకు ప్రాతిపదికగా తనలో ఉన్న ఆత్మను దర్శించడానికి ఈ సమయం చాలా అనుకూలమైనది. దానం చేయడం.. ఈ కాలంలో దానం చేయడం వల్ల ఎన్నో రెట్ల పుణ్యఫలం వస్తుందని పండితులు చెబుతున్నారు. ఈ అధిక మాసంలో పేదలకు లేదా ఇతరులకు ఏమి దానం చేసినా ఎంతో మంచిది. అయితే అన్నిదానాల్లో కన్న మిన్న అయిన అన్నదానం చేస్తే మంచిది లేదా విద్యా దానం చేసినా కూడా మీకు శుభప్రదమైన ఫలితాలొస్తాయట. ఈ రెండింటికి అధిక ప్రాధాన్యం ఉంది. అయితే ఇవే చేయాలని నియమనిబంధనలేమీ లేవు. కాబట్టి మీరు నిరంతరం భగవంతుడి స్మరణ చేస్తూ.. మీ శక్తి మేరకు మీకు తోచిన సాయం చేయండి.