తిరుమల తిరుపతి దేవాలయ చరిత్ర....
Blog Description
ఇక్కడ లభ్యమైన శాసనాలనుబట్టి 15 వందల ఏళ్ల నాటి నుండి తిరుమల చరిత్ర ఈ విధంగా ఉంది. పల్లవ రాణి సామవై క్రీ.శ.614. ఈ మహారాణి కాలంలో ఆనంద నిలయం జీర్ణోద్దరణ కావింపబడింది. శ్రీవారి అనేక ఆభరణాలు సమర్పిస్తూ, ఉత్సవాలు నిర్వహిస్తూ పరమభక్త శిరోమణిగా తిరుమల చ్రిత్రలో శాశ్వతంగా నిలిచింది.ఈమెకి 'పేరుందేవి'అని మరో పేరువుంది. తరువాత తెలుగు పల్లవరాజు విజయగండ గోపాలదేవుడు క్రీ.శ.1328, శ్రీ త్రిభువన చక్రవర్తి తిరువేంకటనాధయాధవరాయలు క్రీ.శ.1429, హరిహరరాయలు క్రీ.శ. 1446 లలో బ్రహ్మోత్సవాలు నిర్వహించారు.
సాళువ నరసింహరాయలు క్రీ.శ.1470 లో భార్య ఇద్దరు కుమారుల తన పేర్లతో సంపగి ప్రదక్షిణం నాలుగు మూలలో నాలుగు స్తంభాల మండపాలని నిర్మిచాడు.క్రీ.శ.1473 లో తిరుమలరాయ మండపానికి వేదిక నిర్మించాడు. ఉత్సవాలు జరిపించేవాడు.
శ్రీకృష్ణదేవరాయలు క్రీ.శ.1513 నుండి 1521 వరకు ఏడు సార్లు తిరుమలకి వచ్చి ఎన్నో కానుకలు సమర్పించాడు, ఉత్సవాలు నిర్వహించాడు. రాయలు 1513 ఫిబ్రవరి 10 న 25 వెండి పళ్లాలను ఇవ్వగా, స్వామివారి పాల ఆరగింపు కొరకు రాయల దేవేరులు రెండు బంగారు గిన్నెలు ఇచ్చారు. 1513 మే 2నరెండవసారి, 1513 జూన్ 13న మూడో సారి తిరుమల సందర్శించి, మూల విరాట్టుకు ఆభరణాలు, ఉత్సవ మూర్తులకు మూడు మణిమయ కిరీటాలు సమర్పించాడు. నిత్య నైవేద్యానికి ఐదు గ్రామాలను కానుకగా ఇచ్చాడు. 1514 జూన్ 6న నాల్గవసారి తిరుమలని దర్శించి,30 వేల వరహాలతో కనకాభిషేకం చేసాడు. నిత్యారాధన కోసం తాళ్ళపాక గ్రామాన్ని దానంగా ఇచ్చాడు.
1517 జనవరి 2న ఐదవ సారి తిరుమలకు వచ్చి ఆలయ ప్రాంగణంలో తమ విగ్రహాలను ప్రతిష్ఠించుకున్నాడు. 1518 సెప్టంబర్ 9నఆనందనిలయానికి బంగారు పూత చేయించాడు. 1518 లో ఆరవసారి, 1521 ఫిబ్రవరి 17నఏడవసారి తిరుమలకి వచ్చి నవరత్న కుళ్ళాయిని, పీతాంబరాలని సమర్పించాడు.
అచ్యుత రాయలు 1530 లో ఉత్సవాలు నిర్వహించాడు. ఆలయానికి ఎన్నో గ్రామాలు భూములను కానుకగా ఇచ్చాడు. 16 శతాబ్దం చివరలో తిరుమల రాయలు అన్నాఊయల మండపాన్ని విస్తరింపజేసి, ఉత్సవాలు నిర్వహించాడు. 1570లో వెంకటపతి రాయలు చంద్రగిరిని పాలించిన కాలంలో ఆలయాన్ని పరిరక్షించాడు.
విజయనగర సామ్రాజ్య పతనానంతరం ఆలయం మహమ్మదీయుల పరమైనది. కర్నాటకకునవాబైన దావూద్ ఖాన్ హైదరాబాదు నిజాంప్రభువులకి కట్టవలసిన పన్నుల కొరకై ఆలయంపై పన్నులు విధించాడు. ఈ ఆదాయానికై మహమ్మదీయులు, మరాఠాలు గొడవలు పడ్డారు, 1740 లో మరాఠీ ప్రభువు ఆలయాన్ని స్వాధీన పరచుకుని, రక్షించి స్వామివారికి ఎన్నో అమ్మూల్య ఆభరణాలు సమర్పించాడు.
తరువాత క్రమంగా 1801 నాటికి ఆలయంఈస్టిండియా కంపెనీ వారి వశమైంది. ఈస్టిండియా కంపెనీ మొదట్లో హిందూ దేవాలయాలను, ముస్లిముల మసీదులను కాపాడుతూ వారి ధర్మాలను స్వయంగా పరిపాలించేవారు. దీనికి సంబంధించిన శాసనం ఒకటి క్రీ.శ.1810లో బెంగాలు ప్రాంతంలో వేయించారు. క్రీ.శ.1817లో చేసిన 7వ రెగ్యులేషన్ చట్టంలో కూడా ఇదే పాలసీని కొనసాగించారు. ధర్మాదాయాల సొమ్మును రెవెన్యూతో పాటు జిల్లా కలెక్టర్లు వసూలు చేసి, దేవునికి క్రమంతప్పక ఉ్సతవాలు, అర్చనలు, భోగాలు స్వయంగా పర్యవేక్షించి జరిపేవారు. దేవాలయంపై వచ్చిన సొమ్ములో ఈ కార్యక్రమాలు చేశాకా మిగిలిన సొమ్ము ఈస్టిండియా కంపెనీ వారి ఖజానాలో చేరేది. కలెక్టర్లపై రెవెన్యూబోర్డుకు తనిఖీ అధికారం ఉండేది. తిరుమల దేవాలయాన్ని కూడా ఇదే పద్ధతిలో పరిపాలన చేసేవారు. దేవాలయంలో చేయాల్సిన సేవలు, ఉత్సవాలు, అర్చనలకు ఖర్చుచేయగా కంపెనీకి మిగిలిన ఆదాయం 1830లోనే దాదాపుగా సాలుకు రూ.లక్షకు పైగా ఉండేదంటే తిరుమల వైభవం ఊహించవచ్చు. తిరుమలలో ఏ దానధర్మాలు చేయాలన్నా ప్రభుత్వానికి సొమ్ము ఇచ్చుకోవలసిన స్థితి ఉండేది . క్రైస్తవ మిషనరీలు కంపెనీ ప్రభుత్వం హిందూదేవాలయాలను, ముస్లిముల మసీదులను నిర్వహించడం ప్రోత్సహించడం క్రిందికే వస్తుందని, ఇది సరైన పని కాదని ఇంగ్లాండులో ఆందోళన చేయగా 1833 నుంచి కంపెనీ వారు దేశంలో మతాల పట్ల జోక్యం కలిగించుకోరాదన్న పద్ధతిలో ప్రవర్తించడం ప్రారంభించారు. ఐతే తిరుమల, పూరి వంటి సుప్రసిద్ధ ఆలయాలకు వచ్చే ఆదాయం బాగా ఎక్కువ కావడంతో వాటిని తమ వశంలోనే ఉంచుకున్నది. ఎప్పటిలా కంపెనీ ఉద్యోగులే నిర్వహించేవారు. ఐతే 1841లో ఆంగ్లప్రభుత్వం హిందూ మతసంస్థలలో జోక్యం చెసుకోకూడదని చట్టం చేసినందున ఆ ఆలయ నిర్వహణ మహంతులకు అప్పజెప్పింది. అప్పటి నుంచి 1863 వరకూ దేవాలయాలను సక్రమంగా నిర్వహించే నాథుడులేక, ఉన్న ధర్మకర్తలు అక్రమాలకు పాల్పడుతూండడం మూలంగా బ్రిటీష్ ఇండియాలోని దేవాలయాలు దెబ్బతిన్నాయి. ఈ స్థితిలో 1863లో కొత్త దేవాదాయధర్మాదాయ చట్టం ఈ అరాచక స్థితిని సరిజేసే ప్రయత్నం చేసింది.1843 నుండి -
మహంతు సేవాదాస్ జీ,మహంతు ధర్మ దాస్ జీ,మహంతు భగవాన్ దాస్ జీ,మహా వీరదాస్ జీ,రామకృష్ణ దాస్ జీ,ప్రయాగదాస్ జీ,
ఇలా 90 ఏళ్ల పాటు మహంతుల పాలనసాగింది.
వీరి తరువాత,1933 లోఅప్పటి గవర్నర్ ధర్మ కర్తల మండలిని ఏర్పాటు చేసాడు.
19 వ శతాబ్దాంతానికి కొండపైన శ్రీవారి ఆలయం,హథీరాంజీ మఠం తప్ప వేరే ఏ నిర్మాణాలూ ఉండేవి కావు. అర్చకులు సైతం కొండ కింద ఉన్న కొత్తూరులోనే ఉండేవాళ్లు. తెల్లవారుజామునే లేచి సప్తగిరులూ ఎక్కి ఉదయం ఏడు గంటలకు స్వామికి మేలుకొలుపులు పాడేవారు. అడవి జంతువులు, దొంగల భయంతో యాత్రికులు గుంపులు గుంపులుగా డప్పులు వాయిస్తూ, గోవిందనామ స్మరణ చేస్తూ కొండ ఎక్కేవారు. రాళ్లూరప్పలూ నిండిన దారిలో కొంతసేపు వెళుతూ మధ్యలో వంటావార్పు కోసం ఆగుతూ... మొత్తానికి పైకి చేరుకునేసరికి దాదాపు రెండురోజులు పట్టేదట. వారు మధ్యలో ఆగేందుకు మూడుచోట్ల దిగుడుబావులూ విశ్రాంతి మండపాలూ ఉండేవి. వాటిని ఠాణాలు అనేవారు. వయసు మళ్లినవారినీ అంగవికలురనూ పిల్లలనూ పైకి తీసుకువెళ్లేందుకు డోలీ కూలీలు ఉండేవారు. కావడి బద్దకు కుర్చీలు అమర్చి నడవలేనివారిని వాటి మీద కూచోబెట్టుకుని వారు పైకి మోసుకెళ్లేవారు. అందుకు పది అణాలు రుసుము వసూలు చేసేవారు. సామాన్యులకు ఆ మాత్రం స్థోమత కూడా ఉండేది కాదు. తిరుమలరాగిచెట్టు (ఇప్పుడు కల్యాణకట్ట ఉన్న ప్రదేశం) దగ్గర డోలీలు నిలుపుకోవడానికి ఒక ప్రత్యేక మండపం ఉండేది. అక్కడిదాకానే ఈ డోలీలను అనుమతించేవారు. ఆ స్టాండును డోలీమండపం బ్లాక్ అనేవారు. (ఇప్పుడా రోడ్డునే డి.ఎం.బి. రోడ్డుగా వ్యవహరిస్తున్నారు.) అక్కణ్నుంచి సన్నిధి వీధి మీదుగా గుడికి చేరుకుని నేరుగా మహాద్వారం గుండా లోపలికి ప్రవేశించి భక్తులు స్వామి దర్శనం చేసుకొనేవారు. 1870లోప్రభుత్వం యాత్రికుల సౌకర్యార్థం కొండమీదకు మెట్లు నిర్మించింది. 1933లో ఏర్పడినతితిదేబోర్డు రూ.26వేల ఖర్చుతో ఆ మెట్ల మార్గాన్ని అభివృద్ధి చేసింది. ఐదుపదుల ఏళ్లనాటి దేవస్థానం రికార్డుల ప్రకారం అప్పట్లో పొద్దున ఏడున్నరకు సుప్రభాత సేవ, రాత్రి పదిన్నరకు ఏకాంతసేవ జరిగేవి. ఇప్పుడు రాత్రి రెండున్నరకు ఆలయం మూసివేసి సరిగ్గా అరగంటలోనే మళ్లీ సుప్రభాతంతో మేల్కొలుపులు మొదలుపెడుతున్నారు.
కొండ మీద ఊరు
తిరుమల నిర్వహణ హథీరాంజీ మఠంఆధ్వర్యంలో ఉన్నప్పుడు యాత్రికులకు సౌకర్యాలు ఏర్పరచాలంటే చాలా కష్టమయ్యేది. ఎందుకంటే అక్కడ ఎవరూ ఉండేవారు కాదు. తిరుమలలోనే ఉందామంటే విపరీతమైన చలి. దానికి తోడు ఆ ప్రాంతమంతా అడవిలా ఉండేది. జంతువుల భయం సరేసరి. కొండమీద ఒక ఊరు తయారైతే ఈ ఇబ్బందులన్నీ అధిగమించవచ్చన్న ఆలోచనతో 1910-20 కాలం నాటికి జనావాసాలను ఏర్పరచేందుకు ప్రయత్నించారు. వారికి ఆవాసం కల్పించేందుకు హథీరాంజీ మఠం భూములు లీజుకు ఇచ్చింది. నెమ్మదిగా ఆలయం చుట్టూ నాలుగు వీధులతో ఒక ఊరు తయారైంది. మొదట్లో అక్కడి జనాభా 200 నుంచి 300 మంది మాత్రమే. స్వామిని చూడవచ్చే భక్తులకు ఈ కుటుంబాలే మొదట్లో అన్ని సౌకర్యాలూ కల్పించేవి. క్రమేణా తిరుమలలో ఉండే వారి సంఖ్య 25వేలకు పెరిగింది. 30 ఏళ్ల క్రితం వరకూ కూడా వారంతా రోజూ సరాసరి మహాద్వారం గుండానే గుడిలోకి వెళ్లి శ్రీవారిని దర్శించుకుని తమ పనులు చేసుకొనేవారు. కానీ యాత్రికుల సంఖ్య పెరుగుతుండటంతో తితిదే వారందరినీ అక్కడి నుంచి ఖాళీ చేయించి తిరుపతికి తరలించింది.
ఘాట్‌రోడ్డు నిర్మాణం
1940ల నాటికి తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య మెల్లగా పెరగడం మొదలైంది. అప్పటి ఉమ్మడి మద్రాసు ప్రభుత్వం కొండమీదకు రోడ్డుమార్గం గురించి ఆలోచించింది. బ్రిటిష్ అధికారులు సర్వే బృందాల వారు తిరుపతి చేరుకున్నారు. 1944ఏప్రిల్ నాటికి అలిపిరి నుంచి తిరుమల దాకా ఘాట్‌రోడ్డు నిర్మాణం పూర్తయింది. అదేనెల పదోతేదీన మద్రాసు రాష్ట్ర గవర్నర్ ఆర్ధర్హోప్ రోడ్డుమార్గాన్ని ప్రారంభించారు. మొదట్లో ఎద్దులబళ్లు, గుర్రపుబళ్లు తిరిగేవి. దీంతో భక్తుల పని సులువైంది. నెమ్మదిగా దేవస్థానమే తిరుమల-తిరుపతి మధ్య రెండు బస్సులు ప్రారంభించింది. ఆ సర్వీసులు తిరుపతిలోని మొదటిసత్రం నుంచి రోజుకు మూడుసార్లు ఉండేవి. తిరుమల నుంచి రాత్రి ఏడు దాటితే బస్సులే ఉండేవి కావు. 1955-56లో రైల్వేస్టేషన్ సమీపాన శ్రీనివాస బస్టాండు ఏర్పడే నాటికి భక్తుల సంఖ్య రోజుకు 500 నుంచి 600 వరకు ఉండేది. బస్సుల సంఖ్య పెంచుకుంటూ పోవడంతో సౌకర్యంగా ఉండి భక్తులు వెల్లువెత్తసాగారు. దీంతో రెండో ఘాట్‌రోడ్డు గురించి ఆలోచించాల్సి వచ్చింది. 1974 నాటికి అదీ పూర్తయింది.