Karthika Masam

Festival Description

స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ శోభకృత్ నామ సంవత్సర కార్తీక మాస పర్వ దినములు
**************************************************************************************

08/12/2023 -- (శుక్రవారం) కార్తీక బహుళ ఏకాదశి సకల శుభములనొసగే శ్రీరమాసహిత సత్యనారాయణస్వామి వారి వ్రతము నందు పాల్గొనండీ.
10/12/2023 -- (ఆదివారం) కార్తీక బహుళ త్రయోదశి మాస శివరాత్రి అన్ని అనారొగ్యములను పొగొట్టి ఆరొగ్యములనొసగే శ్రీధన్వంతరీ పూజ లో పాల్గొనండీ.
11/12/2023 -- (సోమవారం) కార్తీక బహుళ చతుర్దశీ సకల శుభములనొసగే శ్రీ రుద్రాభిషేకము మరియు అర్చన లో పాల్గొనండీ.
12/12/2023 -- (మంగళవారం) పోలి అమావాస్య, పోలి స్వర్గం.
కార్తీక మాసం ముగింపు.

కార్తీక మాస విశిష్టత
హరిహరులకు...సర్వదేవతలకు ప్రీతికరమైన మాసం కార్తీకం. భారతీయ సంప్రదాయాల్లో కార్తీక మాసానికి ఎంతో విశిష్టత ఉంది. మాసమంతా నదీస్నానాలు... దీపారాధనలు..వ్రతాలు,పురాణ పఠనం,కీర్తనం, శ్రవణం, వనభోజనాలు, దైవపూజలు గొప్ప ఫలితాన్ని ఇస్తాయి.కార్తీకమాసంలోని అన్ని రోజుల్లోనూ కార్తీకమాస మహాత్మ్య పురాణ పఠనం.శ్రవణం,అత్యంత పుణ్యప్రదం. కార్తీకమాసం ఆధ్యాత్మికంగా ఎంతో విశేషమైంది. పౌర్ణమి నాడు చంద్రుడు కృత్తిక నక్షత్రానికి దగ్గరగా ఉండటం చేత కార్తీకంగా పేర్కొనబడింది. శరదృతువులో రెండో నెల అయిన కార్తీకానికి కౌముది మాసం అని పేరు. కౌముది అంటే వెన్నెల అని అర్థం.న కార్తీకసమో మాసఃఅంటూ కార్తీకంతో సమానమైన మాసం లేదని స్కంద పురాణం చెబుతోంది. అందుకే అన్ని మాసాలకంటే కార్తీక మాసాన్ని ఎంతో పవిత్రమైన భావిస్తాం.
             
శివకేశవులిద్దరికి ప్రీతికరమైన మాసం
శివకేశవులిద్దరికి ప్రీతికరమైన మాసంగా కార్తీకం ఖ్యాతినొందింది.అందుకే శివారాధనకు,విష్ణువారాధనకు ఎంతో ప్రసిద్ధం .విష్ణువును తులసీదళాలతో అర్చించడం విశేష ఫలదాయకం. ఇంకా విధిగా అవిసె పూలతో విష్ణువును పూజించాలని చెప్పబడింది.

భోజనం... వనభోజనం
                
కార్తీక మాస విధుల్లో మరో ముఖ్యాంశం వన భోజనాలు. వన భోజనాలను పలు వృక్ష జాతులున్న వనంలో ఉసిరిచెట్టు కిందనే చేయాలని శాస్త్రం చెబుతుంది. అంతే కాకుండా వన భోజనాలకు ఇంట్లో వండిన వంటలను తీసుకొని పోవడం కాకుండా వనంలోనే వంటలు చేసుకుని తినాలని చెప్పబడింది. వనభోజన సంప్రదాయంలో ఆధ్యాత్మిక అంశాలే కాకుండా సామాజిక ఏకత్వం లాంటి లౌకిక అంశాలు ఇమిడి ఉన్నాయి.
                
కార్తీకవ్రతాచరణ..నియమాలు
కార్తీకవ్రతాచరణలో ఆచరించాల్సిన కొన్ని నియమాలు ప్రత్యేకంగా చెప్పబడ్డవి. వీటిలో కార్తీక స్నానం, ఉపవాసం, దీపారాధన, దాన ధర్మాలు, సోమవారం వ్రతం ముఖ్యమైనవి.
                
కార్తీక స్నానం
కార్తీకమాసంలో ఆచరించాల్సిన విధులు పుణ్యస్నానాలు ముఖ్యమైనవి. వీటికే కార్తీక స్నానాలని పేరు. కార్తీక స్నానాలను ఆచరించడం వల్ల కాయిక, వాయిక, మానసిక దోషాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి.తెల్లవారక ముందు స్నానం ఆచరించాలని శాస్ర్ర్తాలు పేర్కొన్నాయి. 
                
ఉపవాసం
 కార్తీకంలో ఉపవాసం ప్రధాన నియమంగా చెప్పబడింది.పగలు ఉపవసించి,రాత్రి భోజనం చేయడం మంచిది. పగలంతా ఉపవాసం చేయలేని వారు పాలు, పండ్లు, అల్పాహారం తీసుకోవచ్చు.
                
కార్తీకదీపం
కార్తీక మాసంలో దీపారాధనకు ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఆలయాల్లో ఆకాశదీపాన్ని వెలగించడం ఆచారం.కార్తీక దీపాలను దేవాలయాలు,మఠాలయందు సూర్యోదయానికి ముందు,సాయం సంధ్యాసమయంలోనూ వెలిగించాలి. ఇంటిముంగిట,ఇంటిలోను తులసీకోటవద్ద దీపాలను వెలిగించాలి.దీపారాధన వల్ల కష్టాలు తొలగి ఐశ్వర్యం లభిస్తుంది.
                
ఆకాశదీప మహాత్మ్యం 
కార్తికమాసం ఆకాశదీపంతో ప్రారంభమవుతుంది. నిజానికి ఏవి ఆకాశదీపాలు. మీరు నేను పెట్టక్కరలేదు. ఆకాశదీపాలు వెలిగించినవాడు పరమేశ్వరుడు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవీ ఆకాశదీపాలు. మరి కార్తికమాసం ప్రారంభం దేంతో మొదలు? ఆకాశదీపంతో ప్రారంభం. ఆకాశదీపం ఎక్కడ వెలిగిస్తారు? దేవాలయంలో వెలిగిస్తారు. దేవాలయంలో ధ్వజ స్తంభానికి తాడుకట్టి ఒక చిన్న పాత్రలో దీపం వెలిగించి, గాలికి నిధనం కాకుండా రంధ్రములతో ఏర్పాటు చేసి దాన్ని జాగ్రత్తగా శమంతకంగా భగవంతుని నామాలు చెపుతూ, భక్తులందరూ చుట్టూ నిలబడి ఉండగా, ఆ దీపాన్ని పైకెత్తుతారు. ఎవరి శక్తి కొలదీ వాళ్లు తగినట్లుగా వారు కార్తిక మాసంలో భక్తులు ఆకాశదీపానికి చమురో, వత్తులో ఇస్తూ ఉంటారు. ఆ దీపాన్ని పైకెత్తుతారు ఎందుకని? ఆ దీపం ధ్వజస్తభంం మీద ఉండి అంతటా వెలుతురు చిమ్ముతుంది. ధ్వజస్తంభం మీదకి ఏదైనా లాగారు అంటే, పతాకాన్ని ఆరోహణ చేశారు అంటే ఈశ్వరునికి ఉత్సవం అవుతుందని గుర్తు. ఇంకా కార్తికమాసంలో మనమే ఉత్సవం చేస్తున్నాం. మనకి మనం ఉత్సవం. ఉత్‌ అంటే తలపైకెత్తడం, తల పైకెత్తి చూశాడు కాబట్టి ఉత్సవం. ఏమిటి తల పైకెత్తి చూడ్డం? నాకు ఉన్న గౌరవం ఏమిటి? ఈ శరీరంలో ఉంటూ నేను చేయగలిగిన అధికారం ఏమిటి? సమస్త భూతాలకు నేను మహోపకారం చేయగలను కార్తికపౌర్ణమి నాడు. ఇతర ప్రాణులు చేయలేవు. నేనే చేయగలను. ఏమిటి చేయగలను? దీపం తీసుకెళ్లి ఓ గదిలో పెట్టాననుకోండి కొంత ఫలితం. వీధిలోకి తీసుకువచ్చి దీపం పెట్టాననుకోండి విశేషఫలితం. అందుకే గుత్తు దీపాలని పెడతారు. ఇంతంత వత్తులు వేసి కట్టకట్టి దీపం వెలిగిస్తారు ఆ రోజున. యథార్థానికి శాస్త్రంలో ఏమి చెప్పారంటే ఆ రోజున చెత్త కూడా వెలిగించాలి. వీధులలో ఉన్న చెత్త కూడా వెలిగించేసేయమన్నారు. కానీ లౌకికాగ్నితో వెలిగించకూడదు. మీ ఇంట దీపం వెలిగించి కార్తిక పౌర్ణమి నాటి ప్రదోషవేళ, దామోదరమావాహయామి అనిగాని, త్రయంబకమావాహయామ అనిగాని అని, ఆ దీపంతో వెలిగించాలి. ఈ దీపం పెట్టి ఒక్కసారి ఆకాశం వంక చూసి ఒక శ్లోకం చెప్పాలి. 
                
“కీటాఃపతంగాః మశకా శ్చ వృక్షాః 
జలేస్థలే... ఫలే ఏ నివసంతి  
జీవా దృష్ట్యా ప్రదీపం నచ జన్మ భాగినః  
భవతింత్వ స్వపచాహి విప్రాః “

ఈ శ్లోకం చెప్పి నమస్కారం చేయాలి. ఇప్పుడు నువ్వు నమస్కారం చేస్తే పరమేశ్వరుడు ఎంతో ఆనందాన్ని పొందుతాడు. ఒరేయ్‌ వీడికి నేను మనుష్య శరీరాన్నిస్తే వీడు ఇన్ని భూతాలలో ఉన్న విభూతులను వాడుకున్నాడు. ఇన్నిటిని వాడుకున్నందుకు ఇవాళ వీడు ప్రత్యుపకారం చేశాడు. ఈ ఉపకార బుద్ధి, కృతజ్ఞత ఉన్నవాడు కాబట్టి నా మాట నమ్మి ఉపకారం చేశాడు. కాబట్టి వీడికి నేను మళ్లీ మనుష్యు శరీరం ఇవ్వవచ్చు. ఈ మాట చెప్పినపుడు ‘కీటాఃపతంగాః మశకాశ్చ వృక్షాః’ కీటకములుంటాయి. చిన్నచిన్న పురుగులు. అవి ఎందుకు పుడతాయంటే దీపంలో పడి చచ్చిపోవటానికి పుడతాయి. వాటివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా అంటే నాకేం ఉండదు. బల్లులకుంటుంది. పురుగులను పట్టి తింటాయి. ఇతర భూతములకు ఆహారమై పోతాయి. అధవా వాటి ఆయుర్ధాయం దేనివల్ల నశించిపోతుంది. ఆ దీపం యొక్క జ్యోతి మీద కొంచెంగా పడిపోతాయి. కింద పడిపోయి వాటి రెక్కలు వూడిపోతాయి.
అటువంటి దీపపు పురుగులు దీపం మీద పడి కాలిపోవడం చచ్చిపోవడమే తప్ప అభ్యున్నతి పొందినది లేదు. ఆ దీపం వల్లనే అని తెలిస్తే కదూ! పైగా దీపంలో ఎక్కువగా పడిపోతే దీపం నిధనమైన పాపం వస్తుంది వాటికి తప్ప, దీపం వల్ల ప్రయోజనం పొందలేదు. అని ఇవాళ ఈశ్వరా నేను ఒక సంకల్పం చెప్తున్నాను, ఈ దీపం దీపం కాదు, ఇది త్రయంబకుడు, ఇది దామోదరుడు, కాబట్టి దీనివల్ల మొదటి ఫలితమెవరికి వెళ్లాలంటే కీటాఃపతంగాః మశకాశ్చ, కీటకములు: పురుగులు, పతంగాలు, మశకాశ్చ: దోమలు, వృక్షాః అవి యెంతో ఉపకారం చేస్తాయి. కాయలిస్తాయి, పళ్లు ఇస్తాయి. ఆకులిస్తాయి, కొమ్మలిస్తాయి, రెమ్మలిస్తాయి, కలపనిస్తాయి, ఇళ్లు కట్టుకుంటాం. ఇన్ని చేస్తాం. కానీ ఎండలో అది నిలబడి మనకు నీడనిస్తుంది తప్ప దాని జన్మాంతరంలో అది మాత్రం ఎక్కడికీ వెళ్లలేదు. అలాగే ఉండాలి. ఒక ఆవు వచ్చి దాని కొమ్మలు కొరుక్కు తినేస్తున్నా, ఒక ధూర్తుడు వచ్చి కొమ్మ విరిచేస్తున్నా, ఏవో ప్రాణులొచ్చి దాని మీద కెక్కి అలజడి చేసి  కొమ్మలన్నీ వొంచేస్తున్నా, గొడ్డలి పెట్టి తనను నరికేస్తున్నా, ఒక్క అడుగు ఇలా తీసి, అలా వేయలేని దైన్యం చెట్టుది. అలాగే నిలబడుతుంది. ఆ చెట్టు ఎలా అభ్యున్నతిని పొందుతుంది. కదలలేనపుడు, కర్మ లేనపుడు, దానికి కర్మాధికారం ఏది? అది సంపాదించుకోలేదు. కాబట్టి ఈశ్వరా! నీ దీపపు వెలుతురు ఆ చెట్టుమీద పడుతోంది. కాబట్టి దామోదరుడి చేయి దానిమీద పడినట్టే! త్రయంబకుని చేయి దానిమీద పడినట్టే! అది అభ్యున్నతిని పొందాలి.
నీటిలో ఉండే చేపలుంటాయి, కప్పలుంటాయి, తాబేళ్లుంటాయి. ఈ దీపపు వెలుతురు నీటిమీద పడినపుడు, నీటి లోపల ఉన్నటువంటి ప్రాణులన్నీ కూడా నీ అనుగ్రహాన్ని పొందాలి. అక్కడితో సరిపోతుందా? ఇది కాదు. జలేస్థలే నివసంతి జీవాః దృష్ట్వా ప్రదీపం నచజన్మ భాగినః వాటికేం తెలియదు. అవేం పుణ్యం చేయలేదు,. కానీ ఈ వెలుతురు వాటిమీద పడిన కారణం చేత ఇక వాటికి జన్మ లేకుండుగాక! అక్కడితో వాటికున్నటువంటి పాప పుణ్యాలన్నీ కూడా నశించిపోవుగాక! అని భవతింత్వ శపచాపవిప్రాః అసలు వేదం మీద నమ్మకం లేకుండా కేవలం ప్రాపంచిక కర్మాచరణము మాత్రమే చేస్తూ ఈ లోకంలో తిరుగుతూ కేవలం ఉదర పోషణార్థమే బతుకుతున్న భయంకరమైన స్థితిలో ఉండిపోయిన వాడిమీద ఈ దీపం యొక్క కాంతి ప్రసరించిన కారణం చేత వాడుకూడా వచ్చే జన్మలో వేదము యొక్క ప్రమాణం తెలుసుకున్న వాడై స్వరంతో వేదాన్ని చదువుకొని వేదాన్ని ప్రచారం చేసి వేదానికి చేతులడ్డుపెట్టి లోకోద్ధరణ చేయగలిగిన నిస్వార్థతపూరితమైన లోకోపకారియైున బ్రాహ్మణుడిగా జన్మించి అభ్యున్నతిని పొందుగాక! కాబట్టి భవంతిత్వం స్వపచాహివిప్రా: ఈ దీపపు కాంతి అంత గొప్పది. కాబట్టి ఈశ్వరా, నీ యందు త్రయంబకుణ్ణి, దామోదరుణ్ణి అవాహన చేసి ఈ దీపపు వెలుతురు నీయందు ప్రసరించేటట్లు చేస్తున్నాను.
అందుకే కార్తిక పౌర్ణమి నాడు అన్ని చోట్లా దీపాలెత్తుతారు. ఇక దీపమెత్తని ప్రదేశముండదు. 
                  
కార్తీకంలో దీపదానం
దీపదానం కూడాఎంతో ఫలదాయకం. దీపాన్ని ఉసిరికాయ మీద ఉంచి దానంగా ఇవ్వాలని పురాణాలు చెబుతున్నాయి.  
దానధర్మాలు
కార్తీకంలో చేయబడే దాన ధర్మాలు విశేష ఫలితాన్ని ఇస్తాయి. అందుకే శక్తి కొలది దానాలను చేయడం ఎంతో ముఖ్యం.  
సోమవార వ్రత మహాత్యం
కార్తీకమాసంలో సోమవారం పరమేశుడికి ఎంతో ప్రీతికరం.అందుకే పగలంతా ఉపవాసం ఉండి ప్రదోష కాలంలో అంటే సాయంకాలం శివుడిని శకి ్తకొలది అభిషేకించి,బిల్వదళాలతో అర్చించాలి.రాత్రి జాగరణ చేసి మరుసటి రోజు ఉదయం తిరిగి శివున్ని పూజించి అన్నదానం చేయడం వ్రత నియమంగా చెప్పబడుతోంది.  
నిషిద్ధ పదార్థ్ధాలు
కార్తీకమాసంలో కొన్నిపదార్థాలు నిషేధించబడ్డాయి. ఉల్లి,వెల్లుల్లి, గుమ్మడి,వంగ,ఇంగువ, పప్పుదినుసులైన శనగ, పెసర,అలసందలు మొదలైనవి. 
కార్తీకశుద్ధ పాడ్యమికి బలిపాడ్యమి అనిపేరు                
కార్తీకశుద్ధ్ద పాడ్యమికి బలిపాడ్యమి అనిపేరు. బలిచక్రవర్తిని పూజించడం ఆచారం. బలిపాడ్యమి రోజున దానం చేస్తే సంపదలు తరగవని చెబుతారు.  
కార్తీకశుద్ధ చవితి
కార్తీకశుద్ధ చవితికి కూడా ఎంతో ప్రాధాన్యత ఉంటుంది.కొన్ని ప్రాంతాల్లో నాగుల చవితిగా కూడా ఆచరిస్తారు.కార్తీకశుక్ల పక్షంలో వచ్చే ఏకాదశికిప్రబోధన ఏకాదశి అని పేరు ఉంది.
వైకుంఠ చతుర్ధశి
కార్తీకశుద్ధ చతుర్దశికే వైకుంఠ చతుర్దశి అని పేరు.మహావిష్ణువు పరమశివున్ని పూజించడం చేత ఇది ఎంతో పవిత్రమైన రోజుగా పేర్కొనబడింది.ఈరోజున ఇత్తడి లేదా రాగి కందులలో దీపాలను వెలగించడం..దీపదానం చేయడం అద్భుత ఫలితాలు ఇస్తుంది.
శివాలయల్లో జ్వాలా తోరణం
కార్తీక పౌర్ణమికే త్రిపుర పూర్ణిమ అని పేరు.పరమశివుడు త్రిపురాసురులను సంహరించింది పౌర్ణమి రోజునే కావడం విశేషం. శివాలయాల్లో జ్వాలాతోరణం చేస్తారు.త్రిపురాసురులను వధించిన పరమేశుడికి దృష్టిదోషం పోయేందుకు ఇంకా విజయుడైన అతని గౌరవార్ధం పార్వతీదేవి మొదటగా జ్వాలతోరణం జరిపించిందని పురాణాలు చెబుతున్నాయి.
పుష్పోత్సవం
కార్తీక బహుళ అష్టమిరోజున శివుడికి పుష్పోత్సవం చేయాలని శాస్త్ర ప్రవచనం.అష్టమి నాడు శివున్ని రకరకాల పూలతో పూజించాలని పూర్వశాస్ర్తాలు చెబుతున్నాయి.
రమాఏకాదశి
కార్తీక బహళ ఏకాదశికే రమాఏకాదశి అని పేరు.పెసరపిండితో చేసిన లడ్డులను, బెల్లమును దానం చేస్తే విశేష ఫలం లభిస్తుంది.
కార్తీకమాసం లో దానాలు చేయడం వలన కలిగే ఫలితాలు :
1. బియ్యాన్ని దానం చేస్తే – పాపాలు తొలుగుతాయి.
2. వె౦డిని దానం చేస్తే – మనశ్మా౦తి కలుగుతుంది.
3. బ౦గారం దానం చేస్తే – దోషలు తొలుగుతాయి.
4. ప౦డ్లను దానం చేస్తే – బుద్ధి. సిద్ధి కలుగుతాయి.
5. పెరుగు దానం చేస్తే – ఇ౦ద్రియ నిగ్రహ౦కలుగుతుంది.
6. నెయ్యి దానం చేస్తే – రోగాలు పోతాయి. ఆరోగ్య౦గా ఉ౦టారు.
7. పాలు దానం చేస్తే – నిద్ర లేమిఉండదు.
8. తేనె దానం చేస్తే – స౦తానంకలుగుతుంది.
9. ఊసిరి కాయలు దానం చేస్తే – మతిమరుపు పోయి, జ్ఞాపకశక్తీ పెరుగుతు౦ది.
10. టె౦కాయ దానం చేస్తే – అనుకున్న కార్య౦సిద్ధిస్తు౦ది.
11. దీపాలు దానం చేస్తే – క౦టి చూపు మెరుగు పడుతుంది.
12. గోదానం చేస్తే – ఋణ విముక్తులౌతారు ఋషుల ఆశీస్సులు లభిస్తాయి.
13. భూమిని దానం చేస్తే – బ్రహ్మలోకదర్శనం లభిస్తుంది
14. వస్త్రదానం చేస్తే – ఆయుష్షు పెరుగుతు౦ది.
15. అన్న దానం చేస్తే – పేదరికంపోయి, ధనవృద్ధి కలుగుతుంది.
పైవన్నీమన వేదాల్లో చెప్పినవే… వీటి‌లో మీకు సాధ్యపడేది ఒక్కటైనా చేయ్యమని అర్థం. చేసే సహాయం చిన్నదైనా సరే మనస్తూర్తిగా, శ్రద్ధగా చేస్తే ఫలితం అధికంగా కలదు.....
                
ఆరోగ్య రహస్యాలు
కార్తీకమాసంలో ఆచరణలో కేవలం ఆధ్యాత్మిక అంశాలే కాకుండా ఎన్నో ఆరోగ్య రహస్యాలు కూడా ఇమిడి ఉన్నాయి. వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల శరీరంలో పైత్యం ప్రేరేపించబడే అవకాశం ఉంది. కార్తీకంలో ఉదయమే చన్నీటి స్నానాలు చేయడం వల్ల ఇలాంటి రుగ్మతలను నివారించబడే అవకాశం ఉంది. వాతావరణ మార్పులను బట్టి ఈ నెలలో మనఉదరాలలో ఉత్పన్నమయ్యే జఠరాగ్ని మందంగా ఉంటుంది. ఈ కారణంగా ఆరోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. కార్తీక మాసంలో ఉపవాసం చేయడం వల్ల అంటే పగలు ఉపవాసం ఉండటం వల్ల ఈ ఇబ్బందిని పోగొట్టుకోవచ్చు.