Special Pujas Offered
మహాలయ పక్షం లేదా పితృ పక్షం అంటే ఏమిటి ?
పితృ దేవతలను ప్రత్యేకముగా ఆరాధించే 15 రోజుల కాలమును పితృ పక్షము లేదా మహాలయ పక్షం అంటారు అని గరుడ పురాణం లో చెప్పబడినది. మరణించిన పితృ దేవతలు ఈ భూమికి మరియు స్వర్గానికి మధ్యన కల పితృలోకంలో మరొక జన్మ చక్రంలో చేరే వరకు ఆత్మ రూపంలో నివసిస్తారు అని గరుడ పురాణం మరియు ధర్మ సింధు చెపుతున్నాయి.
భగవద్గీత లో కృష్ణ పరమాత్మ ఈ విధంగా చెపుతున్నారు " జాతస్య – హి – ధ్రువః – మృత్యుః – ధ్రువం – జన్మ – మృతస్య – చ " అంటే పుట్టిన వానికి మరణం తప్పదు, మరణించిన వానికి జన్మం తప్పదు". దీనిని అనుసరించి మరణించిన వ్యక్తి మరలా జన్మఎత్తే వరకు ఈ పితృలోకంలో ఆత్మ రూపంలో నివసిస్తారు అన్న మాట యదార్ధం.
అట్లు నివసించే పితృ దేవతలకు అత్యంత ఇష్టమైన కాలము పితృపక్షముగా చెప్పబడినది. ఈ సమయంలో వారు వారి వారి కుటుంబంలోని వారు కానీ, లేదా ఎవరైనా వారిని ఉద్దేశించి ఏ చిన్న ధర్మ కార్యమైనా, గరుడ పురాణంలో చెప్పిన విధముగా ఏ చిన్న కర్మ ఐనా చేసి వారి దాహార్తి మరియు అన్నార్తి తీరుస్తారేమో అని ఈ భూలోకంలోకి వచ్చి ఎదురు చూస్తారు.
పితృ దేవతలకు ఆకలి ఎందుకు ?
భగవద్గీతలోని 3వ అధ్యాయం, 14వ శ్లోకంలో అన్నాద్భవంతి భూతాని, పర్జన్యాదన్నసంభవః | యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞః కర్మసముద్భవః ||. ఈ శ్లోకం ప్రకారం, "ఆహారం నుండి ప్రాణులు ఉద్భవిస్తాయి, వర్షం వల్ల ఆహారం ఏర్పడుతుంది, యజ్ఞం వల్ల వర్షం కురుస్తుంది, మరియు యజ్ఞం కర్మల (పనులు) ద్వారా పుడుతుంది".
మరణించిన వారు ఆత్మ రూపంలో వారి వారి కర్మలననుసరించి పితృ లోకంలో నివసిస్తూ వుంటారు. వారు వారి కర్మ పరిపక్వము చేసుకోవటానికి తిరిగి జన్మించవలసి ఉంటుంది. దానికి వారికి తగిన ఆహరం అవసరము. ఇచ్చట ఆహారము లేదా నీరు అంటే ఆధ్యాత్మిక ఆహారము అని అర్థము. మనము ఈ సమయంలో అందించే తర్పణము, పిండ ప్రదానము మొదలగునవి వారికి ఆ ఆధ్యాత్మిక ఆహారముగా అందించ బడుతుంది.
భూలోకంలో వదిలే నీరు / పిండము వారికి ఎలా అందుతాయి?
వేరే ప్రదేశంలో వున్నా వారికి మనం డబ్బు పంపాలంటే వారి వివరాలతో ఇక్కడ మన బ్యాంక్లో డబ్బులు వేస్తె, అక్కడ వారికి ఆ దేశంలో చెల్లుబాటు అయ్యే నగదును ఆ బ్యాంకు వారు ఎలా ఇస్తారో, ఇక్కడ కూడా మనము మన పితృ దేవతలను ఉద్దేశించి వారి వారి గోత్ర నామాలతో ఇచ్చే తిల తర్పణములు మరియు పిండప్రదానములు వారికీ అక్కడి ఆహార రూపంలో అందుతాయి. అలా అందుకున్న పితృ దేవతలు సంతుష్టులై వారి వారి కుటుంబ సభ్యులను ఆశీర్వదించుట ద్వారా ఇక్కడ వున్నవారికి మంచి జరుగుతుంది.
మనకు జన్మ నిచ్చిన వారు, మన కుటుంబ సభ్యులు, మన మిత్రులు లేదా మనలను ఆశ్రయంచి మరణించిన ఈ ప్రాణి అయినా ఉత్తమ గతులు లేకుండా, ఎక్కడికి పోలేక మన ఇంటిని ఆశ్రయించి ఉంటే అది అరిష్టము. మన పితృదేవతలకు మోక్షం లభించాలంటే వారి కర్మలు పరిపక్వం అవ్వాలి. అందుకు వారు మళ్ళీ భూమి మీద జన్మ తీసుకోవాలి. అందుకు వారికి అన్నం అందించాలి. అది వారి పిల్లలైన మనం చేయాలి. ఇలా చేయడం ద్వారా మనం వారి పట్ల ఉన్న ఋణాన్ని తీర్చుకుంటాము. అంతే కాక ఉత్తర క్రియలు, కర్మ చేయటం ద్వారా వారికి ఉత్తమ గతులు ప్రాప్టించి మనకు మేలు చేస్తారు.
తద్దినాలు పెడుతున్నాము కదా మళ్ళీ మహాలయం పెట్టాలా ?
నిజమే! ఆబ్దికం చని పోయిన తండ్రి లేదా తల్లిని ఉద్దేశించి కుమారులు చేసే కర్మ. అది మరణ సంవత్సర మొదలు ప్రతి సంవత్సరము వారు చనిపోయిన తిధి నాడు చేసే కర్మ. ఆ రోజు చేసే కర్మలో తండ్రి, తాత, ముత్తాత / అమ్మ, నాయనమ్మ, నాయనమ్మ గారి అత్త గార్లకు పిండ ప్రదానము చేయబడుతుంది. అంతవరకే పరిమితము.
కానీ మహాలయ పక్షము లో చేసే పిండ ప్రదానము కుటుంబంలో మరణించిన అందరకు, అలాగే మరణించిన స్నేహితులు, సన్నిహితులు, గురువులు మొదలగు వారే కాక కారుణ్య పిండము గా కర్మ చేయటానికి కుటుంబ సభ్యులు లేకుండా అనాధ ఆత్మలుగా వున్న వారికి పిండ ప్రదానము చేయ బడుతుంది. అనాధ ప్రేత సంస్కారము ఎంత పుణ్య ప్రదమో ఈ కారుణ్య పిండ ప్రదానము కూడా అంతే పుణ్య ప్రదము. అలాగే ఏ కారణము చేతనైనా ఆబ్దికం కానీ, మాసికము కానీ, ప్రతి మాస అమావాస్య తిల తర్పణము లేదా ఏదైనా పితృ కార్యము చేయుట మరచిన యెడల ఈ పితృపక్షంలో చేసే తర్పణము, పిండ ప్రదానము ఆ దోషములను పోగొట్టి కుటుంబ సౌఖ్యమును ఇచ్చును. ఇంతటి మహత్తు కల ఈ మహాలయ పక్షము లో పిండప్రదానం చేయుట ఎంతో మంచిది.