Bed Time Stories

Devotional FM By Mana Radio

Horoscope

Feedback

Search

కార్తీక పౌర్ణమి విశిష్టత

speaker

కార్తీక పౌర్ణమి విశిష్టత

కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి ను కార్తీక పౌర్ణమి అంటారు . కార్తీక మాసం హరి, హారులకు అత్యంత ప్రీతికరమైన మాసం . అన్ని మాసాల్లోను ఈ కార్తీక మాసానికి ఒక ప్రత్యేకత కలదు అని వేదాలు, పురాణాలు చెబుతున్నాయి.

'శివునికి , విష్ణువునకు ఇద్దరికీ ఎంతో ఇష్టమైన మాసం కావున , కావున మానవాళికి వారిద్దరిని కోలిచి తరింస్తే వారి శుభ అనుగ్రహం పొందడానికి తగిన మాసమని దీనికి ఎంతో 'ప్రాశస్త్యం' కలిగినది అని పురాణాలు తెలుపుతున్నాయి. ఈ మాసంలో ప్రతి రోజు పవిత్రమైనదే. సోమవారాలు, రెండు ఏకాదశులు, శుద్ధ ద్వాదశి, పౌర్ణమి ఒకదానికంటే మరొకటి అధిక ప్రభావవంతమైనవి. నెలరోజులూ చేసే కృత్యాల ఫలితం ఒక ఎత్తు, పౌర్ణమి నాటి కృత్యాల ఫలితం ఒక్కటీ మరొక ఎత్తు; అందువల్ల అనేక వ్రతాలు, పూజలు, కృత్యాలకు, దైవారాధనకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలనీ పురాణాలు వివరిస్తున్నాయి.

ఈరోజు దీపారాధనకు విశేష ప్రాముఖ్యముంది. శివ, విష్ణు దేవాలయాలు రెండింటా దీపాలు వెలిగిస్తారు. విష్ణు ఆలయాల్లో గోపురం మీద, ధ్వజస్తంభం ఎదుట, తులసికోట దగ్గర, దేవుడి సన్నిధిలోనూ ప్రమిదల్లో, ఉసిరికాయలమీద,బియ్యం పిండితో చేసిన ప్రమీదలలో దీపాలు వెలిగించాలి. ఈ దీపాలను చక్కగా కుంకుమ, పూలతో అంకరించుకొని వెలిగించాలి.

శివాలయాల్లో ధ్వజస్తంభం మీద నందాదీపం పేరుతో అఖండదీపాన్ని, ఆకాశదీపం పేరుతో ఎత్త్తెన ప్రదేశాల్లో భరిణలతో (కుండలు, లోహపాత్రలతో తయారుచేసి) వేలాడదీస్తారు. అరటి దొన్నెల్లో దీపాలు వెలిగించి చెరువులలో,నదులలో మొదలగు జల వనరుల్లో విడిచి పెడతారు. ఇలాచేయడం పుణ్యప్రదము,అష్టశ్వర్యాలు కలుగుతాయి. వైజ్ఞానిక పరంగా ఆలోచించి చూడగా ఈ కార్తీక దీపాలను వెలిగుంచే ఆనేక దీపాలవల్ల వాటినుంచి వచ్చే వాయువుల వల్ల వాతావరణంలో కాలుష్యాన్ని తగ్గించి, వాతవరణ శుద్ధి అవుతుంది తద్వారా మనకు ఆరోగ్యం చేకూరుతుంది. ఈరోజు ఆచరించే వ్రతాలలో భక్తేశ్వర వ్రతం ఒకటి. ఇది స్త్రీలకు సౌభాగ్యం కలిగిస్తుంది. భక్తురాలి కోరికను మన్నించి వరాలిచ్చే వ్రతం కాబట్టి దీనికీపేరు. ఇది ప్రాచుర్యంలోకి రావడానికి ఒక కథ ఉంది.

పాండ్యుడు, కుముద్వతి దంపతులు సంతానార్థం శివుని ఆరాధించి ప్రత్యక్షం చేసుకున్నారు. వారుచేసిన ఆరాధనలోని చిన్నలోపంవల్ల సరైన వరం ఇవ్వదలచుకోలేదట శివుడు. అందుకే 'అల్పాయుష్కుడు, అతిమేధావి అయిన కొడుకు కావాలా... పూర్ణాయుష్కురాలు, విధవ అయిన కుమార్తె కావాలా అని అడిగితే- కుమారుణ్నే కోరుకున్నారా దంపతులు. అతడి వయసు పెరుగుతున్న కొలదీ వారిలో గుబులూ జోరెత్తుతోంది. ఆ సమయంలో శివభక్తి పరాయణురాలైన అలకాపురి రాజకుమార్తెపై వారి దృష్టిపడింది. అమె పిలిస్తే శివుడు పలికేటంత భక్తి, శక్తి కలదని విన్నారా దంపతులు. ఆ పిల్లను తమ కోడలిగా చేసుకుంటే తమబిడ్డను పూర్ణాయుష్కుడిగా మార్చే బాధ్యత ఆమె చూసుకుంటుందని ఆలోచించి అలాగే చేశారు. వివాహమైన కొన్నాళ్లకే భర్తకోసం యమభటులు వచ్చేసరికి విషయం తెలుసుకుందా సాధ్వి. తక్షణమే తనభక్తి ప్రభావంతో శివుని ప్రార్థించి ప్రత్యక్షం చేసుకుని భర్తను పూర్ణాయుష్కుడిగా మార్చుకునే వరం పొందిందని పురాణ కథనం.

ఈరోజు చేసే స్నానం, దీపారాధన, ఉపవాసం లాంటి అన్నింటిలోనూ ఆరోగ్య, ఆధ్యాత్మిక భావనలు అంతర్లీనంగా ఉన్నాయి. ఈ మాసమంతా సూర్యోదయానికి ముందే తలస్నానం చేయడం వలన ఈ కాలపు వాతావరణ పరంగా మనకు ఎంతో ఆరోగ్య ప్రదం. ప్రస్తుత కాలంలో ఉద్యోగాల బిజిలో కాని ఇతర ఏ కారణం చేతనైనా రోజు దేవుని పూజించి దీపారాధన చేసే టైం లేనివారు ఆచరించలేని వారు ఈ పౌర్ణమినాడు ఆచరిస్తే చాలు, నెలంతా చేసిన ఫలితం కలుగుతుంది. శివాలయాల్లో జరిపే జ్వాలాతోరణం ఈ రోజుకు మరో ప్రత్యేకత. ఇంకా ప్రాంతీయ, ఆచార వ్యవహారాల భేదంతో అనేక వ్రతాలు, పూజలు, నోములు చేస్తారు. వాటిలో వృషవ్రతం, మహీఫలవ్రతం, నానా ఫలవ్రతం, సౌభాగ్యవ్రతం, మనోరథ పూర్ణిమావ్రతం, కృత్తికా వ్రతం లాంటివి ముఖ్యమైనవి. వీటితోపాటు లక్షబిల్వార్చన, లక్షప్రదక్షిణ, లక్షవత్తులు, లక్షరుద్రం లాంటి పూజలూ చేస్తారు ఈ రోజు.

*నేడు ప్రత్యేకంగా చేయవలసినవి :*
దైవ దర్శనం , దీపారాధన , దీపదానం , సాలగ్రామ దానం , దీపోత్సవ నిర్వహణ ఈ రోజు విశేష శుభ ఫలితాలను అనుగ్రహిస్తాయి అని కార్తీక పురాణంలో పేర్కొనబడినది. ఎవరి శక్తి సామర్ధ్యాలను బట్టి హరి హారులను సేవించి వారి కారుణ కటాక్షాలు పొందండి. వీరిని ఎంత నిష్ఠతో తరిస్తే అంత శుభఫలితాలు ఉంటాయి, “జైశ్రీమన్నారాయణ” “ఓం నమః శివాయ”.