కార్తిక పురాణం - 12వ అధ్యాయము-మొదటి భాగం

Blog Description

ద్వాదశి ప్రశంస

"మహారాజా! కార్తీకమాసమున కార్తీక సోమవారమున కార్తీక ద్వాదశీవ్రతమును గురించి, సాలగ్రామపు మహిమలను గురించి వివరించెదను విను"మని వశిష్ట మహాముని ఈవిధముగా తెలియచేసిరి.

కార్తీక సోమవారమునాడు ఉదయముననే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి వెళ్లి స్నానముచేసి ఆచమనము చేయవలయును. తరువాత శక్తి కొలది బ్రహ్మణునకు దానమిచ్చి ఆ రోజంతయు ఉపవాసము౦డి, సాయంకాలము శివాలయమునకు గాని, విష్ణ్వాలయమునకు గాని వెళ్లి దేవుని పూజించి, నక్షత్ర దర్శనము చేసికొని పిమ్మట భుజింపవలయును. ఈవిధముగా చేసిన వారికి సకల సంపదలు కలుగుటయే గాక, మోక్షము కూడా పొందుదురు.

కార్తీక మాసములో శని త్రయోదశి వచ్చిన యెడల నా వత్రమాచరించినచో నూరు రేట్లు ఫలితము కలుగును. కార్తీక శుద్ధ యేకాదశిరోజున, పూర్ణోపవాసముండి ఆ రాత్రి వివ్ష్ణ్వాలయమునకు వెళ్లి శ్రీహరిని మనసారా ధ్యానించి, శ్రీహరి సన్నిధిని పురాణ కాలక్షేపము చేసి మరునాడు బ్రాహ్మణ సమారాధన చేసిన, కోటి యజ్ఞముల ఫలితము కలుగును. ఈవిధముగా చేసిన వారాలకు సూర్యగ్రహణ సమయమున గంగానదిలో స్నానముచేసి కోటి బ్రాహ్మణులకు భోజన దానము చేసిన నెంత పుణ్యము కలుగునో దానికంటే నధికముగా ఫలము కలుగును. కార్తిక శుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్నారాయుణుడు శేషపానుపు నుండి లేచును గనుక, కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతము విష్ణువునకు యిష్టము. అరోజున శ్రీమంతులెవరైనా ఆవు కొమ్ములకు బంగారు తొడుగులు తగిలించి, ఆవుకాళ్ళకు వెండి డెక్కలు తగిలించి, దూడతో సహా బ్రహ్మణునకు దానమిచ్చిన యెడల ఆయావు శరీర ముందు ఎన్ని రోమములు కలవో అన్ని సంవత్సరాములు యింద్ర లోకములో స్వర్గ సుఖములందుదురు. కార్తీకశుద్ధ పాడ్యమి రోజున, కార్తిక పౌర్ణమిరోజున కంచుపాత్రలో ఆవు నెయ్యి పోసి దీపముంచిన వారు పూర్వజన్మ మందు చేసిన సకల పాపములు హరించును. ద్వాదశినాడు యజ్ఞోపవీతములు దక్షిణతో బ్రాహ్మణునకు దానమిచ్చిన వారు ఇహపర సుఖమును పొందగలరు. ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టునుగాని, సాలగ్రామమునుగాని ఒక బ్రాహ్మణునకు దానమిచ్చినయెడల నాలుగు సముద్రాల మధ్యనున్న భూమిని దానము చేసినంత ఫలము కలుగును.